Thursday, November 14, 2013

బీహార్‌లో అతిపెద్ద విరాట రామాయణ మందిర నిర్మాణం!

బీహార్ రాష్ట్రంలో విరాట రామాయణ మందిరాన్ని నిర్మించనున్నారు. ఈ నమూనాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది

ప్రస్తుతం ప్రపంచంలోనే కంబోడియా దేశంలోని అంగ్‌కోర్‌వాట్ విష్ణుదేవాలయం అతిపెద్ద హిందూ దేవాలయంగా ఉంది. దీనికి మించిపోయేలా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రూ.500 కోట్ల ఖర్చుతో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా విరాట రామాయణ మందిరాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.

ద్వారకపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి సమక్షంలో నితీశ్‌ కుమార్ ఈ ఆలయ నమూనాను ఆవిష్కరించారు. బీహార్ రాజధాని పాట్నాకు 120 కిలోమీటర్ల దూరాన పశ్చిమ చంపారన్ జిల్లాలోని జానకీనగర్‌లో 400 అడుగుల ఎత్తుతో అంగ్‌కోర్‌వాట్ కంటే రెండింతల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

దాదాపు 190 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఐదు అంతస్థుల మందిరంలో భగవాన్ శ్రీరాముడు ప్రధాన పూజలు అందుకుంటారు. రామలక్ష్మణులు నడయాడిన ఈ స్థలంలో, దేశవ్యాప్తంగా వచ్చే విరాళాల సహాయంతో ఆలయ నిర్మాణం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయ నిర్మాణం మహవీర్ మందిర్ ట్రస్ట్ పర్యవేక్షణలో వచ్చే ఐదేళ్లలో పూర్తికానుంది. ఈ మందిర సముదాయంలో శ్రీకృష్ణుడు, శివుడు, పార్వతి, విష్ణు, సూర్య, గణేశ్ తదితర హిందూ దేవతల విగ్రహాలను స్థాపించిన 18 ఆలయాలు ఉంటాయి.

ఈ ఆలయంలో ఏకకాలంలో 20 వేల మంది ఆసీనులు కావ్వొచ్చు. విరాట రామాయణ మందిరం గోపురం, శిల్పకళ అంగ్‌కోర్‌వాట్‌ను పోలిఉన్నా.. దాన్ని పూర్తిగా అనుకరించలేదని అధికారులు చెప్పారు.

No comments: