Wednesday, June 26, 2013

పైసా పెట్టుబడి లేని వ్యవసాయం

ఏమిటీ పైసా పెట్టుబడి లేదా? వ్యవసాయం చేయాలా? ఏం! వేళాకోళంగా ఉందా! ఆగండాగండి, తొందర పడకండి, విషయం తెలుసుకోండి. 
ప్రస్తుత కాలంలో వ్యవసాయం అంటేనే తలకు మించిన అప్పులు, నష్టాలు, ఆత్మహత్యలు. ప్రపంచానికి నేర్పిన దేశంలో ఈ సమస్యలెందుకు వచ్చాయి? అన్నదాత అయిన కర్షకుడు ఆత్మహత్య చేసుకోవలసిందేనా? సారవతంమైన భూమి ఉన్నది, నదీనదాలున్నవి, వేల సంవత్సరాల సేద్యం చేసిన అనుభవం ఉన్నది. మరి సమస్య ఏమిటి? భారతీయతను చీదరించుకుని పాశ్చాత్యతను గ్రుడ్డిగా నెత్తికెత్తుకున్న ఫలితం. హరిత విప్లవం అన్నారు. వేలు లక్షల రూపాయలు పోసి ట్రాక్టరులు, పెద్ద పెద్ద యంత్రాలు కొన్నారు. క్రిమిసంహారక మందుల పేరుతో భూమిని విషపూరితం చేశారు. పచ్చటి నేలను ఉక్కిరిబిక్కిరి చేశారు. సహజంగా భూమిని గుల్లబారేటట్లు చేసే వానపాములను, కుమ్మరి పురుగులను చంపారు. భూమిని నిస్సారం చేశారు. ట్రాక్టర్లు వచ్చాక గ్రామంలోని వడ్రంగులూ కమ్మరి పనివారు వీధిన పడ్డారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల కారణగా ఏయేటికాయేడు దిగుబడి గిట్టుబాటు కాకుండా పోయింది. వీటన్నింటికీ కారణం హరిత విప్లవం. నిజానికి ఇది హరిత విప్లవం కాదు, హరించే విప్లవం. మట్టికి, జీవాలకు హాని కలిగించే ఒక శాపం.
మరి దీనికి పరిష్కారం ?
సుభాష్ పాలేకర్, మహారాష్ట్ర
ఉంది సోదరా! ఉంది. సుభాష్ పాలేకరుడు. మహారాష్ట్రకు చెందిన ఇతడు వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడు. నేటి కర్షకుల సమస్యలను వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసాడు. మనం మన మతాలను మరచిపోవటమే సమస్యలకు కారణమని గ్రహించాడు. హిందూ పద్ధతులలో వ్యవసాయం చేపట్టి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించాడు. ప్రకృతికి పంటకు సంధానకర్తగా మాత్రమే కర్షకుడు ఉండాలంటాడాయన.
పాలేకరుడు సూచించిన విధానం 
రెండు ఎద్దులు, కఱ్ఱనాగలి చాలు. వ్యవసాయం చేయవచ్చు. ఒక్క దేశవాళి ఆవుతో 30 ఎకరాల మిశ్రమ పంటలు పండించవచ్చు. ఆవు పేడ, మూత్రంతో వానపాములు, కుమ్మరి పురుగులు వృద్ధి చెందుతాయి. భూమి సారవంతమవుతుంది. ఆవుపేడ, మూత్రం, పెసర, మినుము, శనగ గింజల పొడుల మిశ్రమం పొలంలో వేస్తే భూమికి అమృతంగా పని చేస్తుంది. ఇలా చేస్తే పొలంలో రసాయనిక ఎరువులు వేయనక్కరలేదు. క్రిమిసంహారక ఘాటు ఉండదు. భూమి, పంట, కర్షకుడు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. విత్తనాలకు, కంపెనీల చుట్టూ తిరగనక్కరలేదు. మన విత్తనాలు మనమే పండించుకోవచ్చు. పాలేకరుడి విధానాన్ని మనదేశంలో 40 లక్షల మంది అవలంబిస్తున్నారు. వారిలో మన రాష్ట్రం వారు 50 వేల మంది. దిగుబడి రెండింతలు పెరిగింది.
2007లో విశ్వ గో సమ్మేళనంలో రాఘవేశ్వర భారతిచే సన్మానం అందుకుంటున్న శ్రీ సుభాష్ పాలేకర్
కృష్ణాజిల్లా కర్షకుడు విజయరామం తన పొలంలో దేశవాళి ఆవులు, ఎద్దులు, నాగలితో దిగుబడి రెండింతలు చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామం కర్షకుడు రాయప్ప ఈ విధానాన్ని ఎంతో మెచ్చుకొన్నారు. సాఫ్టువేర్ ఉద్యోగం వదులుకుని వ్యవసాయం చేపట్టిన సుబ్రమణ్యం నాలుగెద్దులతో ప్రారంభించి ఇప్పుడు వంద ఆవులు పెంచుతున్నారు. వాటిలో 22 కపిల గోవులు. ఈయన రసాయనిక ఎరువులు, ట్రాక్టర్లూ లేకుండా 22 క్వింటాళ్ల బాసుమతి బియ్యం పండించారు. నల్లగొండ జిల్లాలో బాసుమతి బియ్యం పండించిన మొదటి కర్షకుడు ఈయన. 'వ్యవసాయం ఇంత తేలిక' అంటే ఎవరూ నమ్మరే! అని వాపోతున్నారు సుభాష్ పాలేకరుడు. కాని ఒక్క విషయం ఆవు, ఎద్దు అంటే మన దేశవాళి ఆవులు, ఎద్దులు మాత్రమే. జెర్సీ ఆవులు, ఎద్దులు కావంటున్నారు ఆయన. 
ఇక అప్పులు లేవు, ఆత్మహత్యలు అక్కరలేదు. జై గోమాత !

No comments: